శ్రామికవర్గ ఐక్యతకు ప్రతీక ‘మేడే’
calendar_today
May 1, 2026
person
Prajagalam News
మే డే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి... సిఐటియు డిమాండ్
( తాండూర్)
సిఐటియు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర తాండూర్ మున్సిపల్ కార్యాలయం దగ్గర తాండూర్ వ్యవసాయ మార్కెట్ దగ్గర ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి శరణప్ప మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ చరిత్రలో మే1వ తేదీ, ఒక సాధారణ రోజు కాదని అది కార్మికుల చెమట, త్యాగం, పోరాటం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు.8 గంటల పని దినం కోసం చికాగో వీధుల్లో ప్రాణాలు అర్పించిన కార్మికుల స్ఫూర్తిని గుర్తు చేసే రోజని కార్మికులకు హక్కులు ఎవరూ దానం చేయలేదని, పోరాడితేనే సాధించుకోవచ్చని నేర్పిన చారిత్రక మైన రోజు మేడే సందర్భంమని అన్నారు. పని గంటలు పెరగడం, కనీస వేతనాలు పెంపు లేకుండా చేయడం, యానియన్ హక్కులు బలహీనపరచడం, సమ్మె హక్కుపై పరిమితులు విధించడం, కాంట్రాక్టు ఉద్యో గాలను విస్తరించడం, లాంటి తదితర అంశాలు ఈ లేబర్ కోడ్స్‌లో దాగి ఉన్నాయని ఇవి కార్మిక సంక్షేమానికి కాదు, కార్పొరేట్ లాభాలకు సేవ చేసే విధానాలుగా ప్రభుత్వం రూపొందించినదని ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా కార్మికులు, యువత ఈ లేబర్‌కోడ్స్ ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. ఇప్పటికే ఉపాధి భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో, సామాజిక భద్రత లేకుండా జీవిస్తున్న కోట్లాది మంది కార్మికుల జీవితాలు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉందని ”సంస్కరణల” పేరుతో వస్తున్న ఈ మార్పులు వాస్తవానికి కార్మిక వర్గాన్ని బలహీనపరచే చర్యలు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. మేడే మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నదని కార్మిక వర్గం ఐక్యమైతే ఏ దాడినైనా ఎదుర్కోగలదని స్పష్టం చేశారు.గతంలోనూ కార్మికులు సంఘటిత శక్తితోనే కనీసవేతనం, పనిగంటలు, సెలవులు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సామాజిక హక్కులను సాధించుకున్నారు. నేడు అదే ఐక్యతతో లేబర్ కోడ్స్‌పై దేశవ్యాప్తంగా ప్రతిఘటన నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఫ్యాక్టరీలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి రంగంలో కార్మికులు ఈ లేబర్‌కోడ్స్ అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని, ఇతరులకు తెలియజేసి, పోరాటానికి సిద్ధం చేయించాలని అన్నారు .లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకించడం అంటే కేవలం ఒక చట్టాన్ని వ్యతిరేకించడం కాదు, అది కార్మిక వర్గ భవిష్యత్తును కాపాడు కోవడం. ఇది నేటి కార్మికుల కోసం మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా అవసరమైన పోరాటమని కార్మిక హక్కులు బలహీనమైతే ప్రజాస్వామ్యం కూడా బలహీన మవుతుందని ఎందుకంటే కార్మికుడి గౌరవం లేని సమాజం న్యాయమైన సమాజం కాలేదు.ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు ఒక ప్రతిజ్ఞ చేయాలని లేబర్‌కోడ్స్‌ను తిప్పికొడదాం.. కార్మిక హక్కులను కాపాడుదాం.. కార్మికవర్గ విముక్తి కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని మేడే స్ఫూర్తి మనలో చైతన్యం నింపాలన్నారు. పోరాటమే మార్గమని, ఐక్యతే ఆయుధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తాండూర్ మున్సిపల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షులు కే రాములు వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ ప్రధాన కార్యదర్శి డి వెంకట్ తాండూర్ వ్యవసాయ మార్కెట్ హమాలి యూనియన్ అధ్యక్షులు ఎం అంజప్ప కార్యదర్శి నరసింహులు కోశాధికారి బాలప్ప మున్సిపల్ కార్మికులు హమాలి కార్మికులు గ్రామపంచాయతీ కార్మికులు వెంకటప్ప వెంకటేష్ నర్సిములు జిలాని లక్ష్మీ అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.