ప్రజల జీవితాల్లో వెలుగులను నింపడమే ప్రభుత్వ లక్ష్యం .... ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
April 2, 2026
Prajagalam News
తాండూర్:
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ స్పష్టమైన మార్పు తేవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.ప్రజా పాలన_ప్రగతి ప్రణాళిక - 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గౌతపూర్ గ్రామంలో సర్పంచ్ జన్నె సుజణ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభ కు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే హజరయ్యారు. ప్రజా ప్రభుత్వంలో రెండు సంవత్సరాల మూడు నెలలో ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫథకాల నివేదికను అధికారులు గ్రామసభలో వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందించాలని, ప్రజలకు మరింతగా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి మార్చి 9 నుండి జూన్ 02 వరకు *ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక`* అనే పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని స్వీకరించటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యమంలా కొనసాగుతుందని చెప్పారు.ఊరు వాడ నుండి రాష్ట్రస్థాయి సెక్రటేరియట్ వరకు ప్రతి అధికారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత, అభివృద్ధిలపై పక్కా ప్రణాళిక రూపకల్పన, పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేయడం, ప్రజల అవసరాలను గుర్తించడం వాటిని పరిష్కరించడం శరవేగంగా జరుగుతుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా సంక్షేమం,అభివృద్ధి రెండు కూడా జోడెద్దుల వలె తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పడానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మంది మహిళలు ప్రయాణించి, పదివేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,రూ. 500 కే సబ్సిడీపైగ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు,సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారిక పై వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకేజీ, రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు ఇలా ఏ సంక్షేమ పథకం తీసుకున్న ప్రజల ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.మన తాండూర్ నియోజవర్గంలో రవాణా,విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే ధ్యేయంగా ఎమ్మెల్యేగా నేను, గ్రామ స్థాయి మా సర్పంచ్ లు, కౌన్సిలర్స్ అందరూ సేవలందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎసియుటి హర్ష్ సుధీర్ చౌదరి , ఆర్డివో అనిత, మండల్ స్పెషల్ ఆఫీసర్ సత్తార్, ఎఎంసి చైర్మన్ నర్సింలు , మండల పార్టీ ప్రెసిడెంట్ నాగప్ప తో పాటు అన్ని శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.