రైతులకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదు
March 26, 2026
Prajagalam News
ఏఎంసి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
- వికారాబాద్ జిల్లాప్రతినిధి:- రైతులను అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం వికారాబాద్ కూరగాయల మార్కెట్(బీట్లు )ను వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల. శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయించడానికి వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూరగాయల ధరల పట్టికను క్రయావిక్రయాలను మార్కెట్ కమిటీ సిబ్బందికి తెలియజేయాలని అన్నారు.ఈ సందర్బంగా వెజిటేబుల్ మార్కెట్ కమిషన్ దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు అందులో భాగంగా ప్రతి రైతుకు మంచి ధర వచ్చే విధంగా సహకరించాలని,ముట్టిలు, హమాలీ వ్యవస్థ పూర్తిగా తొలగిస్తున్నామని చెప్పారు. మార్కెట్ నిబంధనలకు అనుగుణంగా తమ తమ వ్యాపారం నిర్వహించుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ మాత్రమే తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి విక్రయానికి సంబంధించిన తడ్ పట్టి (రసీదు ) తప్పకుండా రైతులకు ఇవ్వాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కమిషన్ దారుల లైసెన్స్ లు రద్దు చేయబడతాయని హెచ్చరించారు. రైతులు లాభపడేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని , కూరగాయల బజార్లో త్వరలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ మార్కెట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కిష్టారెడ్డి మరియు కమిషన్ ఏజెంట్ లు మార్కెట్ కమిటి కార్యాలయ సిబ్బంది రాజు, ఆనంద్, రవి, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.