schedule Thursday, May 21, 2026

తెలంగాణ బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం

calendar_today March 22, 2026
person Prajagalam News
తెలంగాణ బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం
  ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్ అంటూ విమర్శలు వికారాబాద్ (కుల్కచర్ల) తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్ అంటూ ప్రజల సంక్షేమాన్ని మరిచి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి తప్ప మరో ఉపయోగం లేదంటూ కుల్కచర్ల మండల నాయకులు కే.బి రాజు, మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్ అన్నారు. ఆదివారం కుల్కచర్ల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలను తీరుస్తూ లేకపోయిందని, అభివృద్ధి కార్యక్రమాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించాల్సిన బడ్జెట్, కేవలం అంకెల పరిమితిలోనే ఉండిపోయిందని, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదని విమర్శించారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఇప్పటివరకు ఆ పథకాలు పూర్తి స్థాయిలో అమలుకాకపోవడం ప్రజలను నిరాశకు గురిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేకపోతే ప్రజల తరఫున బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాములు, మొగులయ్య, శ్రీశైలం పాల్గొని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.