రైతులు యూరియా వినియోగం,సాగు ఖర్చులు తగ్గించాలి శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను పాటించి, ఆర్థికంగా ఎదగాలి :- వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణలత దేవి
May 18, 2026
Prajagalam News

(ప్రజాగళం,కుల్కచర్ల)
రైతులు అధిక యూరియా వినియోగం,సాగు ఖర్చులు తగ్గించుకొని శాస్త్రవేత్తలు సూచించిన పద్దతులను పాటించి ఆర్థికంగా ఎదగాలని వరి పరిశోధనా కేంద్రం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణలత దేవి అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధన ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామ పంచాయితీలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పరిశోధనా కేంద్రం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ రైతులు యూరియా అధిక వినియోగం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక ఉత్పాదకత తగ్గుతుందని తెలిపారు. యూరియా వినియోగం తగ్గించడం ద్వారా సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు. అలాగే రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలన్నారు. అధిక రసాయనాల వాడకం వల్ల పర్యావరణం, నేలతల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పురుగుల మందుల ప్రభావం వల్ల రైతులకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు కూడా నశిస్తున్నాయని తెలిపారు. మార్కెట్ లో గిరాకి ఉన్న వరి రకాలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. పంటలను కాపాడటానికి వేపనూనె స్ప్రే, దశపర్ణి కషాయం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి సహజ పద్ధతులను వినియోగించి రసాయన రహిత పంటలను పండించాలని అన్నారు. శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను పాటించి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష మాట్లాడుతూ పురుగుమందులు విచ్చలవిడిగా పిచికారి చేయకుండా పురుగు శాతం గమనించి వాడాలని సూచించారు.కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని, విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ఏఓ వీరా స్వామి మాట్లాడుతూ విత్తనాలు అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొని, బిల్లు తీసుకొని, బిల్లును పంట ముగిసే వరకు దాచిపెట్టుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్ర భూపాల్, పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, రాంరెడ్డి పల్లె సర్పంచ్ నర్సింహులు, వ్యవసాయ విస్తరణ అధికారి సాయితేజ, పంచాయతీ సెక్రటరీ సంతోష్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.