రైతులు సరైన మోతాదులోనే ఎరువులు వాడాలి
May 17, 2026
Prajagalam News
వికారాబాద్-:
రైతులు అవసరం మేరకు మాత్రమే రసాయన ఎరువులను వాడాలని వికారాబాద్ మండల వ్యవసాయాధికారి ప్రసన్న లక్ష్మీ తెలిపారు.ఆత్మ (ATMA) కార్యక్రమం క్రింద వికారాబాద్ మండలంలోని గొట్టిముకుల రైతు వేదికలో శనివారం రైతులకు నానో యూరియా, నానో డిఏపీ వినియోగం మరియు హెచ్‌టీ పత్తి ప్రభావాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రాజేశ్వర్ రెడ్డి నానో ఎరువుల సరైన వినియోగ విధానం, ఖర్చు తగ్గింపు, పంట దిగుబడి పెంపు మరియు హెచ్‌టీ పత్తి వాడకంతో కలిగే ప్రభావాలపై రైతులకు వివరించారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రసన్న లక్ష్మీ మాట్లాడుతూ... రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని పంటలు పండించాలని అన్నారు.రైతులకు ఏఈఓ లు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు.
అనంతరం సర్పంచ్ సుద్దగళ్ల సంగీతాలింగమయ్య మాట్లాడుతూ... రైతులు యూరియా,డీఏపి వాడకం పట్ల అవగాహన ఉండాలని,అధిక మోతాదులో డీఏపి,యూరియా వేసి అప్పుల పాలు కావద్దని తెలిపారు. ఎంత రసాయన ఎరువులు వాడితే అంత దిగుబడి వస్తుందనే అపోహ రైతులు విడాలన్నారు.రైతులు సాగు పద్ధతులు పాటించాలని,కలుపు నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ఏఈఓ అయ్యప్ప రైతులకు పంటల నిర్వహణపై సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.