వినాయక ఆగమనం పేరుతో డీజేలకు అనుమతి లేదు
September 3, 2026
Prajagalam News
⇒వికారాబాద్ సిఐ రఘు కుమార్
- Vikarabad -: ఈ నెల 14వ తేదీ నుండి వినాయక చవితి పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో వినాయక ఆగమనం పేరుతో డిజేలకు అనుమతి లేదని వికారాబాద్ సిఐ రఘు కుమార్ తెలిపారు.పండుగకు ముందుగానే కొంతమంది యువకులు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను తీసుకువచ్చి, రోడ్లపై లేదా రోడ్డు మధ్యలో ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సిఐ తెలిపారు. ఇప్పటి నుంచే ఎవరూ రోడ్లపై విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రజలకు, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని, విగ్రహాల ఏర్పాటు కోసం సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలన్నారు.అదేవిధంగా "ఆగమనం" పేరుతో డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి పాల్పడటం అనుమతించబడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా డిజేలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు లేదా ఊరేగింపుల విషయంలో పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని,ఎటువంటి వివాదాలకు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అలాగే వినాయక విగ్రహాల పేరుతో ప్రజల నుండి బలవంతంగా చందాలు వసూలు చేయడం చేయరాదని, ఎవరైనా చందాల పేరుతో బెదిరింపులకు లేదా బలవంతపు వసూళ్లకు పాల్పడితే, వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.మండపాల వద్ద అసభ్యకరమైన పాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు నిర్వహించకూడదని, మతసామరస్యాన్ని కాపాడుతూ అందరూ పరస్పరం గౌరవించుకుంటూ పండుగను జరుపుకోవాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, అగ్నిమాపక భద్రతా చర్యలు పాటించడం, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వంటి భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సిఐ రఘు కుమార్ చెప్పారు.విగ్రహాల నిమజ్జనం సమయంలో కూడా పోలీసుల సూచనలు మరియు నిర్దేశించిన మార్గాలను తప్పనిసరిగా పాటించాలని,వినాయకుడు మతసామరస్యానికి, శాంతికి ప్రతీక. కాబట్టి అందరూ కలిసి శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.