బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనివి
April 5, 2026
Prajagalam News
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా-:
సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం బిజెఆర్ చౌరస్తా వద్ద మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ....స్వాతంత్రోద్యమం సందర్భంగా క్విట్ ఇండియా, సత్యాగ్రహం తదితర కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ జైలుకు వెళ్లారని అన్నారు. 1935లో అంటరానితనం పారదోలేందుకు, ప్రజలందరికి సమానత్వం కోసం "ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్"అనే సంస్థ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు బాబు జగ్జీవన్ రామ్.రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ తో కలిసి సామాజిక న్యాయం కోసం తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు.తద్వారా రాజ్యాంగ ఫలాలు దేశంలోని అట్టడుగు వర్గాలకు అందడంలో భూమిక పోషించారని అన్నారు.1971 యుద్ద సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాలకు అనుగుణంగా సేనలను నడిపించి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని తెలిపారు. 1974 లో ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో "హరిత విప్లవం" తీసుకురావడంలో బాబు జగజ్జీవన్ రామ్ ది క్రియాశీలక పాత్ర అని కొనియాడారు.
సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడన్నారు.ఆయన చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం అవకాశాల సమాన పంపిణీకి దారితీసిందని చెప్పారు. దేశ నిర్మాణంలో, ముఖ్యంగా వ్యవసాయం, కార్మిక రంగాల అభివృద్ధిలో బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం అని వివరించారు.
బాబు జగజ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుని వారి జయంతిని సమానత్వ దినోత్సవంగా ప్రతి ఏటా ఏప్రిల్ 5 వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నామని అన్నారు.బాబు జగజ్జీవన్ రామ్ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, కులాల వారికి సమానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని,కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడి గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణి ఇవన్ని కూడా అన్ని వర్గాలకు సమంగా అందుతున్నాయని, అదేవిధంగా బీసీ లకు 42 శాతం వరకు రిజర్వేషన్ల పెంపు నిర్ణయం, దేశంలోనే మొదటగా ఎస్ సి ల వర్గీకరణ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందన్నారు.పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం అల్పాహారం, మద్యాహ్నం భోజనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
పదేళ్ళ తరువాత బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆశ్రయం పొందే ప్రభుత్వ హాస్టల్ లలో కాస్మోటిక్ చార్జీలను 200 శాతం, డైట్ చార్జీలను 40 శాతం పెంచిందన్నారు.బాబు జగజ్జీవన్ రామ్ వంటి గొప్ప వ్యక్తి సూచించిన మార్గంలో మనమందరం నడవాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు రామచందర్,నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.