schedule Friday, September 04, 2026

మహిళలు, వృద్ధులు, వికలాంగులను కాంగ్రెస్ మోసం చేసింది

calendar_today September 4, 2026
person Prajagalam News
మహిళలు, వృద్ధులు, వికలాంగులను కాంగ్రెస్ మోసం చేసింది

• ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

• మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

(తాండూర్) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర చౌక్ వద్ద వృద్ధులు, వికలాంగులు, మహిళలతో నిర్వహించిన **“వెయ్యి రోజుల పాలనపై ప్రజా సదస్సు”**లో ఆయన పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి, ప్రస్తుతం అందుతున్న పెన్షన్ విషయంలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని రోహిత్ రెడ్డి తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాలను నడపడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. గ్యాస్ ధరలు, విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు తదితర భారాలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తాండూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మందగించాయని రోహిత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలపై దృష్టి సారించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తే ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మహిళలతో కలిసి వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, వర్కింగ్  ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ నాయకులు పట్లోళ్ల నర్సింలు శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ దీప నర్సింలు, మాజీ కౌన్సిలర్లు బొబ్బిలి శోభారాణి, సంగీత ఠాకూర్, పరిమళ మహిళా నాయకురాలు శకుంతల మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.