schedule Wednesday, September 02, 2026

రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం

calendar_today March 29, 2026
person Prajagalam News
రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వికారాబాద్ జిల్లా-: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ అత్యంత విజయవంతమైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలోని అన్ని సబ్-డివిజన్ల పరిధిలో పోలీసులు, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయడం వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె కొనియాడారు.​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా మొత్తం 3195 కేసులు పరిష్కారం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా 441 FIR కేసులు, 2694 DD (డీడీ) కేసులు, మరియు 60 ఈ-పెట్టి (E-petty) కేసులు పరిష్కరించబడ్డాయని వివరించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తద్వారా సామాన్య ప్రజలకు సమయం మరియు ఖర్చు ఆదా అయ్యాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ​సబ్-డివిజన్ల వారీగా చూస్తే, తాండూరు సబ్-డివిజన్ అత్యధికంగా 1686 కేసులను పరిష్కరించి ప్రథమ స్థానంలో నిలవగా, పరిగి సబ్-డివిజన్ 846 కేసులు, వికారాబాద్ సబ్-డివిజన్ 631 కేసులను పరిష్కరించాయని ఎస్పీ గణాంకాలను వివరించారు. ఒక్క రోజే (28.03.2026) జిల్లా వ్యాప్తంగా 157 FIR కేసులను పరిష్కరించి లక్ష్యానికి మించి ఫలితాలను సాధించామని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి, జిల్లాలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించాలని అధికారులను కోరారు. చట్టపరమైన చిక్కుల నుంచి ప్రజలు విముక్తి పొందేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ స్నేహ మెహ్రా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.​ఇంతటి భారీ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, DCRB డీఎస్పీ జానయ్య, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్,జిల్లా లోని సీఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ​