వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా నాయకుడు
calendar_today
September 2, 2026
person
Prajagalam News
• అనేక సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పు
• వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలు అందరికీ స్ఫూర్తి
• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
(తాండూరు)
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆయన విగ్రహానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజా నాయకుడని అన్నారు. ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్సార్ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం, విద్య అందించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని అన్నారు. వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమ విధానాలను స్ఫూర్తిగా తీసుకుని పేదలు, రైతులు, సామాన్య ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానేతకు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.