schedule Wednesday, September 02, 2026

బీసీ శ్మశానవాటికలకు మోక్షమెప్పుడు?

calendar_today September 1, 2026
person Prajagalam News
బీసీ శ్మశానవాటికలకు మోక్షమెప్పుడు?

• డంపింగ్ యార్డులుగా మారిన శ్మశానవాటిక

• అధికారుల తీరుపై బీసీ సంఘం ఆగ్రహం

 • రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి

•  బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్

  (తాండూరు) పట్టణంలోని బీసీ శ్మశానవాటికలు అధ్వానంగా మారుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై బీసీ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. శ్మశానవాటికల దుస్థితిపై ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.బీసీ సంఘం నాయకులతో కలిసి కందుకూరి రాజ్‌కుమార్ పాత తాండూరు, తాండూరు ప్రాంతాల్లోని బీసీ శ్మశానవాటికలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యంగా తాండూరు పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న శ్మశానవాటిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చుట్టుపక్కల వ్యాపార ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి శ్మశానవాటికలో వేస్తుండటంతో పవిత్రమైన ప్రదేశం కాస్తా చెత్త కుప్పలతో నిండిన డంపింగ్ యార్డుగా మారిపోయిందని మండిపడ్డారు.శ్మశానవాటిక పరిసరాల్లో బహిరంగ మూత్ర విసర్జన, మల విసర్జన జరుగుతున్నా నియంత్రించే చర్యలు లేకపోవడం దారుణమన్నారు. ఫలితంగా పరిసర ప్రాంతమంతా తీవ్ర దుర్వాసనతో నిండిపోయి, ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోవైపు ముళ్ల పొదలు, కంపచెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో శ్మశానవాటికలోకి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.“ప్రజలు తమ ఆత్మీయులను చివరిసారిగా గౌరవంగా సాగనంపాల్సిన ప్రదేశాన్ని ఇంత దారుణంగా ఉంచడం ఏమిటి? ఇది బీసీ శ్మశానవాటికా.. లేక డంపింగ్ యార్డా?” అని  రాజ్‌కుమార్ ప్రశ్నించారు.బీసీ శ్మశానవాటికల అభివృద్ధి కోసం గతంలో పలుమార్లు పాలకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. సమస్యలను వివరించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరినా ఇప్పటివరకు పరిస్థితిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. బీసీ శ్మశానవాటిక అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.ఐదు రోజుల్లోగా బీసీ శ్మశానవాటికల అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున  ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్, నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేశ్, బీసీ సంఘం ప్రతినిధులు మంతటి రాజు, నరహరి గోపాల్, నవీన్, శివ, రమేష్, రవి, సీనూ, కిరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.