ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు సానుకూలంగా స్పందించి, వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆర్బిఓఎల్ సి ఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.మంగళవారం తాండూరు పట్టణంలోని ఆర్అండ్బీ, పోలీస్, జిల్లా మాతా శిశు ఆసుపత్రి, పురపాలక శాఖ అధికారులను ఆయన కలిసి పలు అంశాలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన పెండింగ్ పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన సేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరితో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావాలంటే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.