వికలాంగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
August 21, 2026
Prajagalam News
⇒విఎచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా పోతురాజు సుధీర్
⇒వికలాంగులు హక్కుల కోసం పోరాటం
⇒విఎచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్
- Vikarabad:- అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో వికారాబాద్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించడమే లక్ష్యంగా తమ పోరాటాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం వికారాబాద్ లోని స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన సంఘం వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత సంఘం జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్ తో ప్రమాణస్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో తెలంగాణ రాష్ట్రంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్‌ను 6,000కు పెంచుతామని, రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం 2016 వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ చతిస్గడ్ రాష్ట్రాలలో తమ ప్రభుత్వాల హయాంలో వికలాంగులకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన మాదిరిగానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లోను వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ వికలాంగులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు బాధాకరమని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన తీరు మార్చుకొని వికలాంగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, ఆర్టీసీ లోని అన్ని బస్సుల్లో వికలాంగులకు 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి గ్రేటర్ ఎన్నికల్లో చట్టాన్ని అమలు చేస్తూ ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహించాలని లేనిపక్షంలో,రేవంత్ రెడ్డి సర్కార్ పై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ నుంచే తన ఉద్యమ పోరును ప్రారంభించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని ఇంటి బాట పట్టించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వికారాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికలాంగుల పట్ల చూపుతున్న వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో వికలాంగుల సమస్యలపై గంటపాటు చర్చకు అనుమతి ఇచ్చి ఉంటే రాష్ట్రంలో వికలాంగుల సమస్యలకు ఎప్పుడో పరిష్కారం లభించేదని ,ప్రతిపక్షాలు వికలాంగుల సమస్యలపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం పలుమార్లు ఇచ్చిన చర్చకు అనుమతించకుండా తిరస్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను విమర్శించారు.అనంతరం సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన పోతురాజు సుధీర్ మాట్లాడుతూ.... తనపై నమ్మకం నుంచి వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వికారాబాద్ జిల్లాలో వికలాంగుల జాతి హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు.ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింహులు సంఘం జిల్లా నాయకులు ఊరడి హనుమంతు అనేo గణేషు ఎం చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.