schedule Thursday, May 21, 2026

డీవీఎంసీ సమావేశాలు నిర్వహించండి:-జిల్లా డీవీఎంసీ సభ్యుడు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్

calendar_today May 13, 2026
person Prajagalam News
డీవీఎంసీ సమావేశాలు నిర్వహించండి:-జిల్లా డీవీఎంసీ సభ్యుడు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్

(ప్రజాగళం, పరిగి)

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989 POA యాక్ట్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన జిల్లా స్థాయి డీవీఎంసీ సమావేశాలను వికారాబాద్ జిల్లాలో సంవత్సరాలు గడిచినా నిర్వహించడం లేదని జిల్లా డీవీఎంసీ సభ్యుడు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద్ నాయక్ ఆరోపించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాల్సిన ఈ సమావేశాలకు ఎస్పీ, ఎమ్మెల్యేలు, డీవీఎంసీ సభ్యులు, ఎస్సీ-ఎస్టీ సంఘాల ప్రతినిధులు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. అట్రాసిటీ బాధితులకు అందుతున్న నష్టపరిహారం, కేసుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరగకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాలను కూడా జిల్లాలో సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. మండల స్థాయిలో అధికారులు కేవలం పేరుకే కార్యక్రమాలు నిర్వహించి ఫోటోలు పంపుతూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగానే ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వివక్ష ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీనికి జిల్లా అధికారుల నిర్లక్ష్యమే కారణమని గోవింద్ నాయక్ పేర్కొన్నారు. వెంటనే జిల్లా స్థాయి డీవీఎంసీ సమావేశం ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర, జాతీయ ఎస్సీ-ఎస్టీ కమిషన్లను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.